సీజన్ మారింది, వేసవి వచ్చేసింది, కంటి జాగ్రత్తలు ఎలా?
సీజన్ మారింది. వేసవి వచ్చేసింది. వేసవి కాలంలో చాలా మందికి కంటి సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. కళ్ళు నీరు కారడం, ఎరుపులు, మంటలు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండడం వల్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాస్ తప్పకుండా ధరించాలి. అదికూడా మీ కణతలను కవర్ చేసేటట్టు ఉండాలి. అది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయోలెట్ కిరణాల వల్ల హాని కలగకుండా కాపాడుతుంది, అలాగే దుమ్ము-ధూళి నుంచి కూడా కాపాడుతుంది.
అదేవిధంగా రోజూ మూడుసార్లు చల్లని నీటితో కళ్ళను కడగాలి (లేదా కళ్ళమీద చల్లాలి). అలా చేయడం వల్ల ఎండ వేడిమికి కళ్ళలోకి ప్రవేశించే ధూళి కణాలు తొలగించబడతాయి. మురికి చేతులతో కళ్ళను నలుపుకోవద్దు, కళ్ళకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
మీరు ఏదైనా కంటి ఎలర్జీతో బాధపడుతున్నట్టయితే గనుక, ఏసి ముందు మాత్రం కూర్చోవద్దు. దుమ్ము-ధూళితో నిండిన ప్రదేశంలో కాంటాక్ట్ లెన్స్ లను మితంగా ఉపయోగించాలి. అదేవిధంగా కంటి చుట్టూ ఏదైనా ఎలర్జీ ఏర్పడినట్టయితే, అది కళ్ళకి మేకప్ వేయడం వల్ల కావచ్చు. కాబట్టి నిద్రపోయే ముందు మేకప్ పూర్తిగా తుడిచేయాలి.
డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ద్రవాహారం అధికంగా తీసుకోవాలి, లేదంటే అది కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. కంటి వైద్యుని సంప్రదించి రోజూ ఐ-డ్రాప్స్ వాడండి. కనీసం రెండు వారాలకు ఒక్కసారైనా కంటి వైద్యుడ్ని సంప్రదించండి.