తలనొప్పికి మార్గాలు.. ఇలా చేస్తే అవి పరార్
తలనొప్పికి నిద్రలేమి, కొన్ని రకాల మందుల వల్ల తలనొప్పి రావచ్చు. తగినంత నిద్ర తప్పనిసరి. అక్కర్లేని ఆందోళనలు, ఆలోచనలు తగ్గించాలి. తలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా ఆముదం.. ఇలా ఏదో ఒక నూనెతో మృదువుగా మర్దన చేసుకోవాలి. లేత తమలపాకులను నుదుటిపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
శొంఠి కొమ్ముని పాలతో అరగదీసి నుదుటిపై లేపనంలా వేసుకుంటే నొప్పి తగ్గుముఖం పడుతుంది. లవంగాలు, దాల్చిన చెక్క, బాదం.. మూడింటిని చూర్ణంగా చేసి, సమానభాగాలుగా తీసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై పూతలా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
వాము మూకుట్లో వేసి నల్లగా మాడనివ్వాలి. దాని నుంచి వచ్చే పొగని పీలిస్తే తలనొప్పి తగ్గుతుంది. పాలలో కొద్దిగా శొంఠి పొడిని వేసి బాగా కాయాలి. అందులో కొంచెం పటికబెల్లం కలిపి వేడివేడిగా తాగినా తలనొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.