మళ్లీ తెరపైకి వేలుపిళ్లై ప్రభాకరన్... సంచలనంగా మారిన ఆయన వ్యాఖ్యలు...
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నారట. పైగా, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పళ నెడుమారన్ చెప్పారు. అందువల్ల ప్రభారకన్‌కు తమిళనాడు ప్రభుత్వంతో పాటు తమిళ ప్రజలు అండగా నిలబడలాని ఆయన కోరారు.
తంజావూరులోని ముల్లివైక్కల్ మెమోరియల్‌లో ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ చనిపోలేదని, ఆయన ఇంకా జీవించే ఉన్నారని, త్వరలోనే ఆయన బాహ్య ప్రపంచంలోకి వస్తారని తెలిపారు. తమిళుల మెరుగైన జీవనంపై ఆయన ఓ ప్రకటన చేయనున్నారని తెలిపారు.
పైగా, కుటుంబ సభ్యులతో కూడా ప్రభాకరన్ టచ్‌లోనే ఉన్నారని చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నారని చెప్పారు. అయితే, ప్రభాకరన్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రభాకరన్‌కు ఈలం తమిళుడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల మద్దతు కావాలని ఆయన కోరారు.
కాగా, గత 2009 మే 19వ తేదీన ప్రభాకరన్ చనిపోయారని శ్రీలంక ఆర్మీ ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, ప్రభాకరన్ మృతదేహం ఫోటోలను కూడా లంక ఆర్మీ విడుదలచేసింది. తమ చేతిలో ప్రభాకరన్‌తో పాటు ఆయన కుమారుడు చనిపోయారని ప్రకటించింది. కానీ, పళనెడుమారన్ మాత్రం తద్విరుద్ధంగా ప్రకటించడం గమనార్హం.