సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (10:14 IST)

ఐపీఎల్ 2018 : చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ ... ముంబై జయభేరి

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా ముంబై చిన్నోడు ఇషాన్‌ కిషన్‌ చెలరేగిపోయాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా బౌలింగ్‌ను చీల్చి చెండాడు. అతను లాగి పెట్టి కొడితే బంతి స్టాండ్స్‌లోకి బుల్లెట్‌లా దూసుకెళ్లింది.

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా ముంబై చిన్నోడు ఇషాన్‌ కిషన్‌ చెలరేగిపోయాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా బౌలింగ్‌ను చీల్చి చెండాడు. అతను లాగి పెట్టి కొడితే బంతి స్టాండ్స్‌లోకి బుల్లెట్‌లా దూసుకెళ్లింది. కసిగా బంతిని బాదేస్తుంటే... అలవోకగా సిక్సర్లు కొట్టేస్తుంటే స్టేడియం చిన్నబోయింది. ఇషాన్‌ షాన్‌దార్‌ ఆటతో 210 పరుగులు చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై.. తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి కోల్‌కతాను చిత్తుగా ఓడించింది. దీంతో కోల్‌కతాను వెనక్కునెట్టి ప్లే ఆఫ్‌ రేసులో ముందంజ వేసింది. 
 
టాస్‌ ఓడిన ముంబై బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు సూర్యకుమార్‌ (36), ఎవిన్‌ లూయిస్‌ (18) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. చావ్లా తన వరుస ఓవర్లలో ఓపెనర్లను అవుట్‌ చేయడంతో 9 ఓవర్లకు 62/2తో నిలిచిన ముంబై 150 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. కానీ, ముంబై అసలాట పదో ఓవర్లో మొదలైంది. రోహిత్‌ ధాటిగా ఆడలేకపోతున్నా.. కుల్దీప్‌ వేసిన పదో ఓవర్లో కిషన్‌ భారీ సిక్సర్‌ కొట్టి చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఆపై, చావ్లా బౌలింగ్‌లో మూడు ఫోర్లతో అలరించాడు.
 
ఈ క్రమంలో ఇషాన్‌ 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్‌ బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్‌ కొట్టిన అతను.. మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో ఊతప్పకు చిక్కాడు. మూడో వికెట్‌కు రోహిత్‌తో ఇషాన్‌ 82 పరుగులు జోడిస్తే.. అందులో అతను చేసినవే 62 రన్స్‌ ఉండడం విశేషం. వేగంగా ఆడే ప్రయత్నంలో రోహిత్‌తో పాటు హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 2 సిక్సర్లతో 19) అవుటైనా.. బెన్‌ కటింగ్‌ (9 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 24) భారీ షాట్లు ఆడడంతో ముంబై సులువుగా 200 మార్కు దాటింది. చావ్లా వేసిన ఆఖరి ఓవర్లో కటింగ్‌ 6, 6, 4 రాబట్టగా.. చివరి బంతిని సిక్సర్‌గా మలచి క్రునాల్‌ (8 నాటౌట్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. చివరి ఏడు ఓవర్లలోనే ముంబై 98 పరుగులు రాబట్టడం విశేషం.  
 
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 18.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఛేదనలో ముంబై బౌలర్ల ధాటికి కోల్‌కతా విలవిల్లాడింది. అత్యంత చెత్త బ్యాటింగ్‌తో నైట్‌రైడర్స్‌ క్రునాల్‌ (2/12), హార్దిక్‌ (2/16) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. నిజానికి కోల్‌కతా జట్టు ఏ దశలోనూ లక్ష్యానికి చేరువకాలేక పోయింది. ఓపెనర్‌ నరైన్‌ (4), క్రిస్‌ లిన్‌ (21), నితీష్‌ రాణా (21), ఊతప్ప (14), రస్సెల్‌ (2), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (5) ఇలా ప్రతి ఒక్కరూ తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. దీంతో కేకేఆర్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.