శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (15:40 IST)

ఐపీఎల్ తర్వాత ఫ్యాన్స్‌కి పండగే.. ధోనీకి వీడ్కోలు మ్యాచ్ తప్పక వుంటుందా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఊహించని విధంగా ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత జట్టుకు ప్రపంచ కప్ సాధించి పెట్టిన ధోనీకి వీడ్కోలు మ్యాచ్ లేకపోవడం ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. టీమిండియా ఖాతాలో అనేక రికార్డులు సాధించేలా చేసిన ధోనీ ఇలా ఏ మ్యాచ్‌ లేకుండా వీడ్కోలు పలకడం సబబు కాదని ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిన కెప్టెన్ కేవలం ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలకడం సరికాదని.. ధోనీకి ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని చాలామంది బీసీసీఐని కోరారు. ఇక ఇపుడు బీసీసీఐ కూడా అదే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాత ఆడే అంతర్జాతీయ సిరీస్ లో ధోనిని ఆడించాలనుకుంటున్నట్లు సమాచారం. 
 
ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... భారత జట్టుకు ప్రస్తుతం ఎటువంటి అంతర్జాతీయ సిరీస్‌లు లేవు. కాబట్టి ఐపీఎల్ తర్వాత ధోనికి ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని చూస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే.. భారత జట్టుకు ధోని చాలా సేవ చేసాడు. 
 
కాబట్టి అతనికి చివరి మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. కానీ ధోని ఏం ఆలోచిస్తాడో ఎవరికి తెలియదు. ఎవరు అనుకోని సమయంలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఐపీఎల్ తర్వాత అతను ఆడాల్సిన మ్యాచ్ లేదా సిరీస్‌పై చర్చిస్తాము. ఇక అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరి మ్యాచ్ నిర్వహించి అతడిని సత్కరిస్తాం'' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు