చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి? సురేష్ రైనా అలక చెంది వెళ్ళిపోయాడా?
యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే బీసీసీఐ పెనుసవాల్ ఎదురయ్యింది. సీఎస్కే జట్టులో ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్ సహా.. మొత్తం 13 మందికి కరోనా రావడం నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా సీఎస్కే ఘటనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. సీఎస్కే పరిస్థితిపై తాను ఇప్పుడు మాట్లాడలేనని తెలిపాడు. షెడ్యూల్ ప్రకారం టోర్నీలో తమ పోరును మొదలు పెడుతుందో లేదో చూడాలి. ఐపీఎల్ సుదీర్ఘమైనది. అంతా సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నానని చెప్పాడు.
కాగా ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌ది ఘనమైన చరిత్ర. చెన్నై మూడు టైటిల్స్ సాధించింది. ముందుగా ప్రాక్టీస్‌కు దిగుదామని భావించిన సీఎస్‌కే కరోనా టెస్టులు చేయించుకోగా మొత్తం 13 మందికి పాజిటివ్ తేలింది. ఇందులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు మిగతా సిబ్బంది ఉన్నారు. ఫలితంగా మళ్లీ ఐసోలేషన్‌లోకి వెళ్లింది సీఎస్‌కే. ప్రాక్టీస్ కాస్తా ఎగిరి క్వారంటైన్‌లో పడింది.
ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎస్‌కే స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తిరిగి భారత్‌కు వచ్చేశాడు. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతోనే రైనా అలక చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైనా క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రైనా ఉన్నపళంగా వచ్చేయడంపై సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా వైరస్ తమను వెంటాడుతుంటే మరొకవైపు రైనా వెళ్లిపోవడం ఆ జట్టుకు ఒకేసారి రెండు ఎదురుదెబ్బలు తగిలినట్లు అయ్యింది.