సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:23 IST)

లోయర్ ఆర్డర్‌లో ఎందుకు వస్తున్నానంటే.. : ఓటమికి ధోనీ వివరణ

ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. రాయల్స్ నిర్ధేశించిన 217 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
ఈ ఓటమికి గల కారణాలను సీఎస్కే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విశ్లేషించాడు. 217 పరుగులు అసాధ్యమైన లక్ష్యమేమీ కాదని వ్యాఖ్యానించిన ఆయన, 14 రోజుల క్వారంటైన్ తమ సన్నద్ధతపై ప్రభావం చూపిందని అన్నాడు.
 
తమకు సాధన చేసేందుకు అవసరమైన సమయం దొరకలేదన్నారు. ముఖ్యంగా తాను, గడచిన ఏడాదిగా ఆడకపోవడంతోనే లోయర్ ఆర్డర్‌లో వస్తున్నానని చెప్పాడు. జట్టులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మందికి కరోనా రావడం ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు శామ్ కరణ్‌తో పాటు రవీంద్ర జడేజాను ముందు పంపిస్తూ, ధోనీ ఆరో స్థానంలో దిగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆఖరి ఓవర్లో మాత్రమే మూడు సిక్స్‌లు బాది, తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు. అయినా, ఈ మ్యాచ్‌లో ధోనీ ఆట సీఎస్కేను విజయ తీరాలకు చేర్చలేకపోయింది. ధోనీ మరో ఓవర్ ముందే తన బ్యాట్‌ను ఝళిపిస్తే బాగుండేదని సీఎస్కే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.