బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (22:13 IST)

రెచ్చిపోయిన గబ్బర్ సింగ్.. ఢిల్లీ భారీ స్కోరు - మూల్యం చెల్లించుకున్న హైదరాబాద్

ఐపీఎల్ 2020 టోర్నీ 13వ సీజన్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి క్వాలిఫయర్ - 2 మ్యాచ్ జరుగుతుండగా, ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగుల  భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా, ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ మరోమారు రెచ్చిపోయి, బ్యాట్‌కు పని చెప్పాడు. మొత్తం 50 బంతులను ఎదుర్కొన్న శిఖర్... ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
అలాగే, మరో ఓపెనర్ మార్కస్‌ స్టాయినీస్‌ 27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ 38 రన్స్ చేయగా, హెట్‌మైర్‌ 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో 42 (నాటౌట్‌) రన్స్ చేశాడు. అయితే, ఆఖరి వరకు క్రీజులో ఉన్న ధావన్‌ ఇన్నింగ్స్‌ ఆద్యంతం అలరించాడు. రన్‌రేట్‌ పడిపోకుండా భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును ముందుండి నడిపించాడు.
 
ధావన్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన స్టాయినీస్‌  మెరుపులు మెరిపించడంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 65/0తో మెరుగైనస్థితిలో నిలిచింది. తొలి వికెట్‌కు  ఓపెనింగ్‌ జోడీ 86 పరుగులు జోడించింది. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 20 బంతుల్లో ఫోర్ సాయంతో 20 పరుగులు చేశాడు. మిడిల్‌ ఓవర్లలో ధావన్‌కు సహకారం అందించాడు. 
 
ఆరంభంలో ధారళంగా పరుగులు ఇచ్చిన సన్‌రైజర్స్‌ బౌలర్లు ఆఖర్లో ఢిల్లీని కాస్త కట్టడి చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(1/30), రషీద్‌ ఖాన్(1/26)‌ కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. 4 ఓవర్లు వేసిన హోల్డర్‌ వికెట్‌ తీసి 50 పరుగులు సమర్పించుకోగా.. 4 ఓవర్లు వేసిన షాబాజ్‌ నదీమ్‌ 48 పరుగులు ఇచ్చుకున్నాడు. వీరిద్దరి బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ దంచికొట్టారు. కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఫీల్డర్లు చాలా క్యాచ్‌లను జారవిడిచారు. 
 
దీనికితోడు ఈ ఇన్నింగ్స్‌లో పలు క్యాచ్‌లు వదిలిన సన్ రైజర్స్ తగిన మూల్యం చెల్లించింది. సన్ రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ 1, హోల్డర్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. నిజానికి హైదరాబాద్ జట్టు బౌలింగ్ పటిష్టంగా ఉంది. అత్యధిక శాతం మ్యాచ్‌లు బౌలింగ్ పటిమతోనే గెలుచుకుంది. కానీ ఇవాళ ఐపీఎల్ క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు.