రాజస్థాన్ రాయల్స్‌కు కేకేఆర్ షాక్.. బౌలర్లు అదరగొట్టారు.. చుక్కలు చూపించారుగా..
ఐపీఎల్ 2020, 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌కు కేకేఆర్ షాకిచ్చింది. వరుసగా రెండు విజయాలతో దూసుకుపోయిన రాజస్థాన్ రాయల్స్‌కు బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. అన్ని విభాగాలలో రాజస్థాన్ కంటే మెరుగ్గా ప్రదర్శన చేసిన కార్తీక్ సేన రాజస్థాన్ రాయల్స్ మీద ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లైనప్‌లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్‌ను 137 పరుగులకే కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
కేకేఆర్ బౌలర్లలో శివం మావి, నాగర్‌కోటి, ప్యాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తిలు రాణించి జట్టుకు మంచి విజయాన్ని అందించారు. మావి, నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, కమిన్స్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్‌లు తలో వికెట్ తీశారు.
రాజస్థాన్ ఆటగాళ్లలో టామ్ కరాన్ (54 నాటౌట్; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక రాజస్థాన్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. ఇది కోల్‌కతాకు రెండో విజయం కాగా, రాజస్తాన్‌కు తొలి ఓటమి కావడం గమనార్హం.
తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ గిల్ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్ మెరుపులతో కేకేఆర్ 170 పరుగుల మార్కును దాటింది.
కాగా 34 బంతుల్లో 47 పరుగులు చేసిన గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. చివర్లో ఇయాన్ మోర్గాన్(34 నాటౌట్; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇక కమిన్స్(12; 10 బంతుల్లో 1 ఫోర్), నాగర్‌కోటి(8 నాటౌట్; 5 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది..
కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల టార్గెట్‌లో రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. రాజస్థాన్ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో తేరుకోలేకపోయింది. ఇక జోఫ్రా ఆర్చర్ వచ్చీ రావడంతోనే ఒక సిక్స్ కొట్టినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు.
వరుణ్ చక‍్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నాగర్‌కోటి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆర‍్చర్ ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, టామ్ కరాన్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఓటమి తప్పలేదు.