గురువారం, 30 నవంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (08:48 IST)

ఈ సీజన్ ఐపీఎల్ ఆడలేనంటున్న రవిచంద్రన్ అశ్విన్.. ఎందుకో తెలుసా?

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుటుంబం కష్టాల్లో ఉంది. అశ్విన్ కుటుంబ సభ్యులు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. దీంతో ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమైనట్టు అశ్విన్ ప్రకటించారు. 
 
ఢిల్లీ కాపిటల్స్ జట్టులో అత్యంత కీలకమైన స్పిన్నర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. నిన్నటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో సూపర్ ఓవర్ వరకూ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపు తరువాత రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్‌లో స్పందించారు.
 
"రేపటి నుంచి ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల నుంచి విరమించుకుంటున్నాను. నా కుటుంబీకులు, బంధువులు, కొవిడ్ 19పై పోరాడుతున్నారు. ఈ కష్ట సమయంలో వారికి నేను అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులన్నీ చక్కబడితే తిరిగి పోటీల్లోకి వస్తాను. ధన్యవాదాలు ఢిల్లీ కాపిటల్స్" అని ట్వీట్ చేశారు. 
 
అశ్విన్ ట్వీట్ కు ఢిల్లీ కాపిటల్స్ కూడా స్పందించింది. "మీ కుటుంబం కష్టాల్లో ఉన్న వేళ మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున మీ కుటుంబానికి మద్దతు ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం" అని పేర్కొంది.
 
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్, 27 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్‌ను కూడా తీయలేదు. సూపర్ ఓవర్‌ను కూడా అక్సర్ పటేల్‌తో బౌలింగ్ చేయించారు. సూపర్ ఓవర్‌లోనూ ఆఖరి బంతి వరకూ సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శిఖర్ ధావన్‌లు తమ ముందున్న 7 పరుగుల లక్ష్యాన్ని అధిగమించారు.