శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (19:50 IST)

మహిళల ఐపీఎల్ క్రికెట్ కూడా జరగాలి.. బీసీసీఐకి మిథాలీ విజ్ఞప్తి

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం పురుషుల టోర్నీగా అదరగొడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో మహిళల విభాగంలోనూ ఈ టోర్నీ జరగాలని టీమిండియా మహిళల వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పురుషులంత కాకపోయినా పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ప్రారంభించాలని కోరింది. 
 
'పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ఆడించాలని మిథాలీ రాజ్ బీసీసీఐని కోరింది. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే కొన్ని నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలని చెప్పింది. నలుగురు విదేశీ క్రికెటర్లే కాకుండా తొలి సీజన్‌లో ఐదు లేదా ఆరుగురితో ఆడించాలని మిథాలీ తెలిపింది. 
 
పూర్తిస్థాయి ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేకపోయినా ప్రస్తుత ఫ్రాంఛైజీలు జట్లను తీసుకుంటే ఆ సమస్యను అధిగమించొచ్చని టీమిండియా కెప్టెన్‌ అభిప్రాయపడింది.
 
దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మంది క్రికెటర్లు లేరనే విషయం తనకు తెలుసునని.. కానీ ఇప్పుడున్న ఫ్రాంఛైజీలు ఐదు లేదా ఆరు కొత్త జట్లను తయారు చేస్తే సరిపోతుందని చెప్పింది. ఎలాగూ బీసీసీఐ వద్ద నాలుగు జట్లున్నాయి. బీసీసీఐ ఎల్లకాలం ఈ విషయంలో వేచి చూడొద్దని.. ఏదో ఒక సందర్భంలో ముందడుగు వేయాలని మిథాలీ విజ్ఞప్తి చేసింది.