ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్.. భారత్‌లో కరోనాపై బెంగాల్ దాదా ఏమన్నారు?
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై కరోనా ప్రభావం పడింది. ఈ సీజన్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కరోనా వైరస్ క్రికెటర్లను భయపెడుతోంది. పలుచోట్ల కరోనా కేసులు నమోదవుతున్న వార్తల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందేహమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం అలాంటిదేమీ లేదని.. యధావిథిగా ఐపీఎల్ పండుగ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు.
ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ... ఐపీఎల్‌పై కరోనా ప్రభావం లేదన్నారు. అయినా.. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఐపీఎల్ విజయవంతంగా జరుగుతుందని చెప్పారు.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కరోనా ఎఫెక్ట్ గురించి మాట్లాడారు. భారత్‌లో క్రికెట్ సిరిస్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అందువల్ల ఐపీఎల్‌తో పాటు దక్షిణాఫ్రికా భారత్ పర్యటన యథావిధిగా సాగుతుందని చెప్పుకొచ్చారు.