శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 21 జులై 2021 (09:51 IST)

నేడే బ‌క్రీద్... ఖుర్బానీకి అర్ధం తెలుసా?

ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం లు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. 
 
హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ మసీద్ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కా నుండి మదీనాను సందర్శిస్తారు. 
 
అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. 
 
బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు.

హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం దాగిఉంది. 
 
ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్‌ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ ఖుర్భాని కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా, మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్‌ సిద్ధపడ్డాడు.

ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లింలు  భావిస్తారు.