జియో కస్టమర్లకు షాక్.. వైర్‌లెస్ డేటా టారిఫ్‌లను పెంచేస్తుందా?
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు వైర్ లెస్ డేటా ఛార్జీల బాదుడుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వైర్ లెస్ డేటా టారిఫ్‌లను పెంచాలని జియో నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 5గా ఉన్న ఒక జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది.
ఈ మేరకు ట్రాయ్‌కు జియో లేఖ రాసింది. ప్రతిపాదిత డేటా ధరలను తక్షణమే కాకుండా 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్‌కు తెలిపింది. పెరగనున్న డేటా చార్జీలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయంది. వాయిస్ కాల్స్ ధరల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న వాటినే యథావిధిగా కొనసాగించనున్నట్టు జియో వెల్లడించింది.
ఇప్పటికే టెల్కో దిగ్గజాలు భారీగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున టెలికాం పరిశ్రమ భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.35వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రిలయన్స్ జియో ఒక టార్గెట్ ఫ్లోర్ ధరను నిర్ణయించిన తర్వాత, ఇది టెలికాం పరిశ్రమలో కీలకమైన అంశంగా ఉండి, దెబ్బ తిన్న కంపెనీలకు సాయం చేస్తుందని జియో పేర్కొంది.