పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంటే చేపల కూర
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. పోషకాహారం ఇవ్వాలని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు. వారానికి రెండుసార్లు కూరల్లో ఉడికించిన చేపలను పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి మెదడు పనితీరు మెరుగ్గా వుంటుంది. నూనెలో వేపిన చేపలకంటే.. చేపల కూరల్లో వుండే చేపల్ని పిల్లలకు తినిపించడం ద్వారా వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతాం.
అంతేగాకుండా మహిళలు గర్భంగా వున్నప్పుడే చేపలను తీసుకుంటే.. పుట్టే శిశువు మెదడు పనితీరు మెరుగు అవుతుంది. ఇంకా మెదడు సంబంధిత రుగ్మతలు దరిచేరవు. గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవం అయిన ఆరేడు నెలల వరకు మహిళలు ఆహారంలో చేపలను భాగం చేసుకోవాలి. మెదడు మెరుగ్గా పనిచేయాలంటే.. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.
ఈ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో పుష్కలంగా వున్నాయి. అలాగే పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ డి వుంటాయి. అందుకే పాలను పిల్లకు ఇవ్వడం ద్వారా నరాల బలహీనతను దూరం చేయవచ్చు. అంతేగాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుచవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు.
పాలు, చేపలతో పాటు మెదడులో జ్ఞాపకశక్తిని పెంచే సెల్స్‌లో ముఖ్యమైన కొలైన్‌కు శక్తినివ్వాలంటే.. పిల్లలకు రోజూ ఓ గుడ్డును ఆహారంలో చేర్చాలి. కోడిగుడ్డులో కొలైన్ అధికంగా వుంది. ఇందులోని విటమిన్-డి పెరుగుదల లోపాలను సరిచేస్తుంది.
ఇదేవిధంగా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచాలంటే.. ఓట్స్, దంపుడు బియ్యం, చిరు ధాన్యాలు, కూరగాయలు, కాయగూరలు తీసుకోవాలి. బచ్చలికూర, బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, మొలకెత్తిన ధాన్యాలను పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.