గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 జూన్ 2021 (21:34 IST)

త‌ప్పులు ఎంచే మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా
 
అర్థం: ఉప్పు, కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనపడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. చూడటానికి అందరూ మనుషులొక్కమాదిరి గా కనిపించినా, పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు. వారిని గుర్తించగలగాలి. అదే విజ్ఞత.
 
2. 
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభి రామ వినురవేమ!
 
అర్థం:  
పాడగా పాడగా పాట మధురంగా నుండును. చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తీపిగా ఉండును. అట్లే ఈ భూమిపై  ప్రయత్నంతో ఎటువంటి పనులనైనా సాధించగలం.
 
3. 
తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగరు
విశ్వదాభి రామ వినురవేమ
 
అర్థం:
ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇత‌రుల్లో త‌ప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం.