మహాశివరాత్రి మార్చి 1: బ్రహ్మాండమే ఒక శివలింగం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజదుఃఖ వినాశక లింగం
తత్‌ప్రణమామి సదాశివ లింగం
ఈ చరణాలతో ప్రారంభమయ్యే లింగాష్టకం ఎంతో ప్రసిద్ధమైనది. బ్రహ్మాదిదేవతలు, మునులు సిద్ధులతో సహా అందరూ అర్చించే శివస్వరూపమైన లింగం ఎటువంటిదీ? ఈ శివలింగం జన్మ వల్ల కలిగే దుఃఖాన్ని నాశనం చేస్తుంది. రావణాది రక్కసుల అహాన్ని అణచివేస్తుంది.
బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది. పాపాలను పటాపంచలు చేస్తుంది. కోటి సూర్యల కాంతితో వెలిగిపోతూ వుంటుంది. శివమూ, సత్యమూ, సుందరమూ అయిన ఒక వస్తువు అంతటా వ్యాపించి వుంది. అది చాలా విలక్షణంగా, విశిష్టంగా, అనంతంగా... అసలు వర్ణించనలవిగానట్లు వుంటుంది. దానికి ఇది మొదలు, ఇది చివర అని నిరూపించడం కష్టం.
దానికి ఓ పేరు పెట్టడం, రూపం కల్పించడం సాధ్యం కాదు. అది అణువుల్లో అణువుగా వుంటుంది. మహత్తుగా వుంటుంది. దృశ్యంగానూ, అదృశ్యంగానూ కూడా వుంటుంది. ఇటువంటి వస్తువుకు ప్రతీకగా చెప్పినదే శివలింగం.