శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (08:22 IST)

ముంబైలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం - 11 మంది మృతి

ముంబై కురుస్తున్న వర్షాలకు మాల్వాని ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి 11.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చిన్నారులు సహా పలువురు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికులతో కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
 
కాగా, ఈ ఘటనాస్థిలిలో సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. కూలిన భవనం సమీపంలోని ఇతర బిల్డింగులు కూడా ప్రమాదంలో ఉండడంతో అందులోని వారిని ఖాళీ చేయించినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలినట్టు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు.
 
నగరంలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది. రోడ్లు, రైలు ట్రాకులపైకి నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై సహా పలు జిల్లాలలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటించింది.