సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (21:46 IST)

రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే బీజేపీ కథ కంచికే.. గవర్నర్

Satya Pal Malik
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు చేసిన గవర్నర్ సత్యపాల్ మాలిక్.. చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. 
 
నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన చేస్తున్న రైతుల డిమాండ్లను నెరవేర్చాలని సత్య పాల్ మాలిక్ ప్రభుత్వాన్ని కోరారు.  రైతుల సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే.. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదంటూ స్పష్టంచేశారు. 
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గ్రామాల్లోకి కూడా నాయకులు ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. తాను మీరట్‌నుంచి వచ్చానని.. రైతు సమస్యను పరిష్కరించకపోతే.. తన ప్రాంతంలోని ఏ గ్రామంలో కూడా బీజేపీ నాయకులు ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. ఒక్క మీరట్‌లోనే కాదు ముజఫర్‌నగర్‌, బాగ్‌పత్‌ ఇలా రైతు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించలేరంటూ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొందరి మాటలు విని రైతు సమస్యను సాగదీస్తోందని.. ఇలాంటి వారి వల్లే మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
 
కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటిస్తే ఆటోమేటిక్‌గా రైతు ఉద్యమం ముగుస్తుందంటూ గవర్నర్ సలహా ఇచ్చారు. ఎంఎస్‌పీ ఇస్తామని హామీ ఇవ్వడానికి కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు. రైతులకు మద్దతుగా పదవిని వదులుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతం తన పదవిని వదులుకోవాల్సిన అవసరం లేదని.. అవసరమైతే వదులుకుంటానని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత సత్యపాల్‌ మాలిక్‌.. రెండుసార్లు ఎంపీగా గెలిచారు.
 
లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ప్రశ్నించగా.. ఘటన జరిగిన మరుసటి రోజునే అజయ్‌ మిశ్రా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఆయన కేంద్ర మంత్రి పదవికి పనికిరారంటూ వ్యాఖ్యానించారు.