శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (13:14 IST)

దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు పూర్తి

దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేసిన నేటికి ఐదేళ్లు పూర్తయింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. గత 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేశారు. ఈ నోట్లను రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఆనాడు ప్రధాని మోడీ ప్రత్యేక ప్రసంగం ద్వారా పెద్ద నోట్లను రద్దును ప్రకటించారు. 
 
దీంతో అప్పటివరకు చెలామణిలో వున్న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకువచ్చారు. వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను తీసుకువచ్చారు. వ్యవస్థలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని పూర్తిగా తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 
 
అయితే పెద్దనోట్ల రద్దు వల్ల నల్లధనం తొలగించే సంగతి ఏమో గానీ.. దేశంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరారు. క్యూల్లో నిలబడి పలువురు మరణించారు. దేశం మొత్తాన్ని బ్యాంకులు ముందు బారులు తీరేలా చేసింది. 
 
నోట్ల రద్దు వ్యవహారం తర్వాత డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగాయి. యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న కొనుగోళ్లకు కూడా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే కరోనా వచ్చాక పరిస్థితి మొదటికి వచ్చింది. కానీ, గత ఏడాది నుంచి కరెన్సీ నోట్ల వాడకమూ పెరుగుతోంది. మార్కెట్లలో కరెన్సీ చెలామణి విపరీతంగా పెరిగినట్టు ఆర్‌‌‌‌బీఐ గుర్తించింది.