శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:52 IST)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదువార్త.. వేతనాల సవరణకు..?

currency
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. వాళ్ల వేతనాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమవద్ద లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది.
 
7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో ఏర్పాటుచేయగా ఆ సంఘం సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 8వ వేతన సంఘాన్ని గనక ఏర్పాటు చేస్తే ఆ సంఘం సిఫార్సులు 2026 జనవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర వేతన సంఘం సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా? తద్వారా జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా? అంటూ ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎంపీ దీపక్ బాజి, బీహార్ బీజేపీ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 
 
8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోమని ప్రకటించడం ద్వారా రాబోయే కాలానికి కూడా 7వ వేతనం సంఘం సిఫార్సులనే అమలు చేయనున్నట్లు మోదీ సర్కార్ సంకేతాలిచ్చినట్లయింది. అయితే, ప్రస్తుత కాలానికి 7వ పే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి (1947) నుంచి ఇప్పటి వరకు ఏడు పే కమీషన్లు ఏర్పాటయ్యాయి. ఆర్థిక శాఖ పరిధిలో వ్యవహరించే పే కమిషన్లు.. ప్రతి పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ సవరించేందుకు నిర్దేశించారు. చివరిగా 7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలున్నాయి.