తండ్రి చనిపోయారు... కానీ ఆయన నిర్దోషి అని నిరూపించేందుకు పోరాడిన సంతానం...
లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ డాక్టర్ నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాకపోతే చాలా ఆలస్యంగా సదరు వ్యక్తికి న్యాయం లభించింది. కేసు నమోదై 32 సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టులో ఇప్పుడు ఆయన నిర్దోషిత్వం రుజువైంది. కానీ తీర్పు వినడానికి ఆయన లేరు. నాలుగేళ్ల క్రితం కాలం చేసారు. నిశికాంత్ కులకర్ణి అనే ఆ వైద్యుడు మహారాష్ట్రలోని మన్మాడ్ మునిసిపాలిటీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు.
వంద రూపాయలు తీసుకుని డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని ఆయనపై 1987 సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. అయితే ఓ వ్యక్తి తన సోదరుని మరణ ధృవీకరణ పత్రం కోసం నిశికాంత్ 150 రూపాయల లంచం అడిగినట్లు, చివరకు 100 రూపాయలకు బేరం కుదిరిందని ఏసీబీకి ఫిర్యాదు చేసాడు. ఈ కేసుపై సెషన్స్ కోర్టు 2005లో తీర్పు చెప్పింది. డాక్టర్‌కు ఒక ఏడాది, ప్యూనుకు ఆరునెలల శిక్ష పడింది.
కాగా లంచం తీసుకుంది ప్యూను కాబట్టి నిందితులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. కేసు నడుస్తుండగానే డాక్టరు వృద్ధాప్యం వల్ల చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలనే పట్టుదలతో హైకోర్టులో కేసును కొనసాగించారు. చివరకు విజయం సాధించారు. కాగా ఆ విజయాన్ని చూసుకునేందుకు ఆ డాక్టరు లేకపోవడం విచారకరం.