శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (16:08 IST)

తృణమూల్ కాంగ్రెస్ శిబిరం‌లో అలారం మోగించడం ఖాయం.. ఓవైసీ

బీహార్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న ఎంఐఎం.. పశ్చిమ బెంగాల్‌లో కూడా పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ శిబిరంలో అలారం మోగించడం ఖాయమని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తామని ఒవైసీ ప్రకటించారు.
 
పశ్చిమ బెంగాల్ ఎంఐఎం నాయకులతో త్వరలో సమావేశమై చర్చిస్తానని, వారు తమ సంసిద్ధతను, విశ్వాసాన్ని చూపిస్తే.. తదుపరి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పోటీ చేయడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 'ఓటు కటువా'కు సమాధానమిచ్చిన ఓవైసీ.. మీ లోక్‌సభ నియోజకవర్గం బెర్హంపూర్‌లో ఎంత అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఆదిర్ రంజన్ చౌదరిని మందలించారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గంలో ముస్లిం సమాజం కోసం చేసిన అభివృద్ధి పనులపై చౌదరిని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ముస్లింల పరిస్థితి ఎందుకు ఘోరంగా ఉన్నదో అధీర్ రంజన్ చౌదరి స్పందించాలన్నారు.
 
బీజేపీపై కాంగ్రెస్ సమర్థంగా పోరాడలేకపోతోందని ఓవైసీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలను బీజేపీ ఎలా గెలుచుకోగలిగిందో వివరించాలని ఆయన కాంగ్రెస్ నాయకుడిని అడిగారు. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.