ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ... సిఫార్సు చేసిన రైల్వే బోర్డు
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని భారతీయ రైల్వే బోర్డు సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 275 మంది మృతి చెందగా దాదాపు వెయ్యికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘోరకలిపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కేంద్ర రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
ఘటన స్థలంలో సహాయ చర్యలు, ట్రాక్ పునరుద్ధణ వంటి పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు, బెంగుళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరిమితి వేగంతోనే ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచేందుకు వీలుంది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు 128 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత అధికంగా ఉంది.
ఈ మార్గంలో ఎలక్ట్రానికి లాకింగ్ వ్యవస్థ కూడా సజావుగానే ఉందని, కానీ అందులో ఎవరైనా ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నిలింగ్ లోపమే ఈ ఘోర దుర్ఘటనలకు కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొనడం తెలిసిందే.