ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (16:06 IST)

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

third ac compartment
రైళ్లలో వేసవి రద్దీ విపరీతంగా ఉంది. సాధారణ బోగీల్లో అయితే ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక రిజర్వేషన్ బోగీల్లోకి కూడా ఎక్కేస్తున్నారు. తాజాగా బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఇదే సీన్ కనిపించింది. థర్డ్ క్లాస్ ఏసీ బోగీలోకి చాలా మంది టికెట్ లేని ప్రయాణికులు ఎక్కేసి ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
విజయ్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'పాట్నా జంక్షన్‌లో నేను, నా కుటుంబ సభ్యులు రైలు ఎక్కేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాం. మేం రిజర్వ్ చేసుకున్న సీట్లలో కూర్చొనేందుకు పోట్లాడాల్సి వచ్చింది. ఏసీ 3 టైర్ బోగీని అంతా జనరల్ టికెట్ ప్రయాణికులు ఆక్రమించారు. నిబంధనల గురించి పట్టించుకొనే వారెవరూ లేరు' అంటూ ఆ వీడియో కింద కామెంట్ చేశాడు. 
 
తాము 8 టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నామని.. కానీ వేరే ప్రయాణికులు ఆక్రమించడంతో 6 సీట్లలో మాత్రమే కూర్చోగలిగామని చెప్పాడు. ఏసీ బోగీలో ఎక్కిన వారిలో కొందరు జనరల్ టికెట్లతో ప్రయాణిస్తుంటే మరికొందరు అసలు టికెట్లు లేకుండానే ఎక్కేశారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
దీనిపై రైల్వే శాఖకు చెందిన ప్రయాణికుల సహాయ సోషల్ మీడియా అధికారిక ఖాతా 'రైల్వే సేవ' స్పందించింది. పీఎన్ ఆర్ వివరాలు, మొబైల్ నంబర్‌ను తమకు అందిస్తే తగిన సాయం చేస్తామని తెలిపింది. అలాగే ఫిర్యాదుల కోసం నేరుగా తమ వెబ్ సైట్ 
http://railmadad.indianrailways.gov.inను సంప్రదించాలని సూచించింది. 
 
అలాగే సమస్యల సత్వర పరిష్కారానికి 139 నంబర్‌కు డయల్ చేయాలని కోరింది. అయితే రైల్వే శాఖ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 1990ల నుంచి బిహార్‌లో దాదాపు ప్రతి రైల్లోనూ ఇదే దృశ్యం కనిపిస్తోందని ఓ యూజర్ ఎద్దేవా చేశాడు. అలాంటి ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు సూచించారు. రైల్వే శాఖపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించి రూ.10 లక్షల పరిహారం కోరాలని మరో యూజర్ చెప్పాడు. చట్టపరమైన చర్యలు తీసుకొనే వరకు రైల్వే అధికారులు ఏమాత్రం పట్టించుకోరని విమర్శించాడు.