ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (12:40 IST)

'అమ్మ' అస్త్రాన్ని ప్రయోగించిన దినకరన్ వర్గం .. కేసు నమోదుకు ఈసీ ఆదేశం

చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం జరుగనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు.

చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం జరుగనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ముఖ్యంగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, శశివర్గానికి చెందిన టీటీవీ దినకరన్, డీఎంకే అభర్థి మరుద గణేష్‌లు పోటీ చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పోలింగ్‌కు ఒక్క రోజు ముందు దినకరన్ వర్గం సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. జయలలిత మరణానికి ముందు అపోలో ఆస్పత్రిలో ఉన్న వీడియోను దినకరన్ వర్గానికి చెందిన పెరంబూరు ఎమ్మెల్యే పి. వెట్రివేల్ బుధవారం రిలీజ్ చేశారు. 20 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్‌లో ఆస్పత్రిలో జయలలిత జ్యూస్ తాగుతున్నట్టు కనిపించారు. ఈ వీడియో గత 2015 సెప్టెంబర్ 25వ తేదీన ఈ వీడియో తీసినట్లు చెబుతున్నారు. 
 
దీనిపై వెట్రివేల్ స్పందిస్తూ, అపోలో ఆస్పత్రిలో జయలలితను ఎవరూ కలవలేదు అనేది అబద్ధమన్నారు. సెప్టెంబర్ 25న ఆస్పత్రిలో ఉన్నప్పటి విజువల్స్ అని ఆయన తెలిపారు. కాగా, జయ చనిపోయిన యేడాది తర్వాత అమ్మకి సంబంధించిన విజువల్స్ బయటకు రావడం సంచలనంగా మారింది. జయలలిత ఆస్పత్రికి వచ్చే సమయంలోనే… అపస్మారక స్థితిలో ఉన్నారని ఇటీవలే చెప్పారు. ఈ వీడియోపై అపోలో ఆస్పత్రి వర్గాలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయో చూడాలి… అయితే ఈ వీడియోపై అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మార్ఫింగ్‌కు పాల్పడి ఉండొచ్చని కూడా అంటున్నారు.
 
మరోవైపు, ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు జయలలిత చికిత్సకు సంబంధించిన వీడియో రిలీజ్ చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో ఈ వీడియోను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే పి.వెట్రివేల్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆర్కే నగర్ ఎన్నికల నిర్వహణాధికారి ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే వెట్రివేల్‌పై 126 (బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.