కార్తీక పౌర్ణమి... బియ్యం పిండి.. ఉసిరి దీపముల ఫలితాలు
కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈ రోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.
ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి.
అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. శివఅష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకూరుతాయి.
పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, గుడికి వెళ్లి శివునిని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.
అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఫుణ్యమని, సాలగ్రామ దానములు శుభదాయకము.