ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (18:41 IST)

యమద్వితీయ.. భగినీ హస్తాన్న భోజనం.. ఆచారం ఎలా వచ్చిందంటే?

Food
కార్తీకమాసం రెండోరోజు విదియనాడు 'యమద్వితీయ'గా పాటించటం ఆనవాయితీగా వస్తోంది. సోదరుడిపట్ల సోదరి ప్రేమకు ప్రతీకగా- దీన్ని 'భ్రాతృవిదియ'గా పరిగణించడమూ పరిపాటి అయింది. చతుర్వర్గ చింతామణి సహా అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావన వస్తుంది.
 
పురాణాల ప్రకారం.. యమునా నది- యమధర్మరాజుకు చెల్లెలు. ఆమెకు అన్నగారంటే వల్లమాలిన ఆపేక్ష. తన ఇంటికి రమ్మని, తన చేతివంట భుజించి వెళ్ళమని, ఎన్నిసార్లో సోదరుణ్ని ఆమె అభ్యర్థించింది. 
 
ఓ రోజు యముడు సోదరి ఇంటికి వచ్చాడు. ఆరోజు కార్తీక శుద్ధ విదియ. చిత్రగుప్తునితో సహా విచ్చేసిన యమునికి.. ఆయన పరివారానికి యమున ప్రీతిగా స్వాగతించి.. చేతులారా వంట చేసి విందు భోజనాలతో వడ్డించింది. 
 
యమున చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు. అలాగే ఆరోజు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని  అనుగ్రహిస్తాడు యముడు. 
 
అందుకే ప్రతిఏటా కార్తీక శుద్ధ విదియ 'భగినీ హస్తాన్న భోజనం' అని పిలవడం మొదలైంది. ఆ రోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో- ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు.