అన్నదానం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో తెలుసా?
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అన్నాన్ని గురించి ప్రస్తావించాడు. అన్నం భగవంతుని సొత్తు. మనది కాదు. పరమాత్మయే వర్షాల్ని కురిపించి ధాన్యం సృష్టిస్తున్నాడు. భోజనం లేనిదే మనం లేము. మన జీవనాధారం భోజనం పైనే ఆధారపడి వున్నది. ఆ భోజనాన్ని మనకు అందించే దేవునకు సదా కృతజ్ఞులమై వుండాలి.
మనం చూపే కృతజ్ఞతయే ఆ దేవునికి మూల్యం. అదే భక్తి. ఆ భక్తితో మనం తినే అన్నాన్ని భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి. లేదా దానిలో కొంత భాగాన్ని ప్రాణికోటికి సమర్పించాలి. ఈ శరీరం పంచకోశములతో ఆవృతమై వుంది. అవి అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం. ఇవి ఉల్లిపొరల వలె ఒకదాని లోపల ఒకటి విలీనమై వుంటాయి. వీటిలో అన్నిటికంటే బయట వున్నది అన్నమయకోశం. లోపల వున్నది ఆనందమయకోశం. అందుకే అన్నమయకోశం శరీరంగాను, ప్రాణమయకోశం దీనికి ఆత్మగా చెప్పబడింది.
సద్గృహస్తులు అతిథులకు అన్నం సిద్దంగా వుందని చెప్తారు. అతిథులు ఏ సమయంలో వచ్చినా వారికి అన్నం పెడతారు. ఎవరు సిద్ధమైన అన్నాన్ని అత్యంత శ్రద్ధాభక్తితో అతిథులకు, అభ్యాగతులకు సమర్పిస్తారో వారు జన్మాంతరంలో అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పించబడిన అన్నాన్ని శ్రమపడక్కర లేకుండానే గౌరవంగా పొందుతారు. ఎవరు తక్కువ శ్రద్ధతో ఇక తప్పదని గ్రహించి ఈ సిద్ధమైన అన్నాన్ని అతిథులకు, అభ్యాగతులకు సమర్పిస్తారో వారికి జన్మాంతరంలో అదేవిదంగా తక్కువ శ్రద్ధతో సమర్పించబడిన అన్నం, సామాన్య శ్రమతో దొరుకుతుంది.
ఎవరు అత్యంత నిరసనతో అన్నంలేదు పో... అంటూ పరిభాషిస్తారో వారికి జన్మాంతరమందు అదేవిధంగా అత్యంత నిరసనతో అతికష్టం మీద అన్నం దొరుకుంది. కనుక ఆశ్రయించివచ్చిన వారికి అన్నం పెట్టాలి. ఎంతమంది వచ్చినా అన్నం సిద్ధపరుచుకోవాలి.