దేవుని ముందు కర్పూరం వెలిగించడమంటే?
దేవతారాధన పూజలకు నిర్ధిష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్ళితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు.
ప్రారంభంలో ఈ జపం మూల కూర్చుని, మాలపట్టుకుని జపం చేస్తూ చేస్తూ చివరకు మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానినే అజపాజపస్థితి అని పిలుస్తారు. అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని అహంకారాలు, కామనలు వంటివే.
అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి పరమాత్మకు సమర్పించడం, పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్ళీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.