శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (10:00 IST)

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

garuda seva in tirumala
తిరుమలలో శ‌నివారం రాత్రి పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. 
 
గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం : పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
ఘ‌నంగా కుమార‌ధార తీర్థ ముక్కోటి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శ‌నివారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. మాఘ మాసంలో పూర్ణిమనాడు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిండాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. 
 
ఈ సంద‌ర్భంగా భ‌క్తులు కొండ‌మార్గాల్లో సౌక‌ర్య‌వంతంగా న‌డిచేందుకు వీలుగా ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు.  అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగ‌ళి, ఉప్మా, సాంబార‌న్నం, పెరుగన్నం, పాలు, తాగునీరు అందించారు. శ్రీ‌వారి సేవ‌కుల సాయంతో భ‌క్తుల‌కు వీటిని అంద‌జేశారు. మార్గమ‌ధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచారు. పోలీసు అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని టీటీడీ భ‌ద్ర‌తా విభాగం అధికారులు త‌గిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌తోపాటు ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. తీర్థం వ‌ద్ద ప్ర‌థ‌మ‌చికిత్స కేంద్రాన్ని ఏర్పాటుచేసి అవసరమైనవారికి మందులు అందించారు.