శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 30 ఆగస్టు 2018 (21:55 IST)

శుద్దభక్తి అంటే ఏమిటి? ఎలా వుండాలి?

భగవంతుని పట్ల భక్తి ఉన్నదని మానవుడు భ్రమపడుతుంటాడు. కోరికలు తీరినప్పుడు సంతోషిస్తూ, అవి నెరవేరనప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు. కోరికలు తీరనప్పుడు భగవంతుడిని శంకిస్తాడు. కానీ లౌకిక విషయాల పట్ల ఉన్నంత వ్యామోహం భగవంతుని మీద ఉండదు. ఆ విషయం మానవుడు అంత త్వరగా అర

భగవంతుని పట్ల భక్తి ఉన్నదని మానవుడు భ్రమపడుతుంటాడు. కోరికలు తీరినప్పుడు సంతోషిస్తూ, అవి నెరవేరనప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు. కోరికలు తీరనప్పుడు భగవంతుడిని శంకిస్తాడు. కానీ లౌకిక విషయాల పట్ల ఉన్నంత వ్యామోహం భగవంతుని మీద ఉండదు. ఆ విషయం మానవుడు అంత త్వరగా అర్థం చేసుకోలేడు. భగవంతుని మీద శుద్దభక్తి ఉన్నవాడు మాత్రమే తరిస్తాడు. శుద్దభక్తి అంటే ఎలా ఉండాలంటే మానవుడికి భగవంతుణ్ణి దర్శించడమొక్కటే కావలసినది. 
 
ధనం, కీర్తి దేహ సుఖాలు మొదలైనవి ఏమీ వద్దు అనే భావం ఉండాలి. ఇలాంటి భావాన్నే శుద్దభక్తి అంటారు. అదెలాగంటే... ఒకసారి అహల్య రాముడితో ఇలా అంది. ఓ రామా.... నేను పందిగా జన్మించినా సరే, దాని గురించి నాకు ఎలాంటి చింతా లేదు. కానీ నాకు నీ పాదపద్మాల పట్ల శుద్దభక్తి కలిగేలా మాత్రం అనుగ్రహించు, అన్యంగా నేనేమీ కోరను.
 
ఓ రోజు సీతారాములను దర్శించి నారదుడు వారిని స్తోత్రపాఠాలతో స్తుతించసాగాడు. రాముడు వాటితో సంతుష్ఠుడై నారదా.... నేను నీ స్తోత్రపాఠాలతో సంప్రీతుడనైనాను. నువ్వు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు. ఓ రామా... నువ్వు నాకు వరం ఇచ్చి తీరవలసినదే అంటే నాకు ఈ వరాన్ని ప్రసాదించు- నీ పాద పద్మాల పట్ల నాకు శుద్దభక్తి కలిగేలా చెయ్యి అన్నాడు. అప్పుడు రాముడు ఇంకా వేరేమయినా కోరుకో అన్నాడు. అందుకు జవాబుగా నారదుడు నేను వేరే ఏమీ కోరుకోను. నేను కేవలం నీ పాదపద్మాల పట్ల శుద్దభక్తిని మాత్రమే కోరుకుంటాను అన్నాడు. 
 
శుద్దభక్తిలో ఆనందం ఉంటుంది. కానీ అది విషయానందం కాదు. అది భక్తి వల్ల కలిగే ఆనందం, ప్రేమానందం. సద్భక్తుడు ఇలాంటి భక్తిని ప్రసాదించమని భగవంతుడిని మనస్పూర్తిగా వేడుకోవాలి.