గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (14:32 IST)

ఎంత గాఢ నిద్రలోఉన్నా, తల్లిపేరు వినిపించగానే..?

కౌసల్య.. అమ్మ పేరు వినిపించగానే గాఢనిద్రలో ఉన్న కమలాక్షుడి కనురెప్పలలో కదలిక, కౌసల్యమ్మ రూపం మనసులో మెదిలే ఉంటుంది. పెదాల మీద చిరునవ్వు, అద్దంలో చందమామను చూపుతూ అమ్మ తినిపించిన పాలబువ్వ గుర్తుకొచ్చి ఉంటుంది. విశ్వామిత్రుడి వెను వెంట.... యాగ సంరక్షణకు బయలుదేరే సమయానికి రాముడు కౌమారుడే అయినా, అచ్చంగా అమ్మచాటు బిడ్డ. 
 
ఎంత గాఢ నిద్రలోఉన్నా, తల్లిపేరు వినిపించగానే బిడ్డ దిగ్గున మేల్కొంటాడు. కౌసల్యా సుప్రజా రామ... పదమోగ రహస్యమూ అదే. వాల్మీకి రామాయణంలో బ్రహ్మజనకుడికి బ్రహ్మర్షి పలికిన ఆ మేలుకొలుపే వేంకటేశ్వర సుప్రభాతానికి ప్రారంభ శ్లోకం. త్రేతాయుగంలో రాముడికి పలికిన సుప్రభాతం.. కలియుగంలో వేంకటరాముడి సుప్రభాతమైంది.
 
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం.. తెలతెలవారుతోంది. కర్తవ్య నిర్వహణకు సమయం ఆసన్నమైందని విశ్వామిత్ర మహర్షి రాముడికి గుర్తుచేస్తున్నాడు. తెల్లారేలోపు సంధ్యాది విధులు ముగించుకుని విల్లంబులతో యాగ సంరక్షణకు బయల్దేరాలి. లలితమోహనాంగుడైన రాముడు.. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేలీ విహార లక్షీ నారసింహా అన్నట్టుగా నరశార్దూలమై నృసింహావతారం నాటి ఉగ్రత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. సూర్యోదయం మార్పునకు ప్రతీక. ఆ మార్పు చెడు నుంచి మంచి వైపు కావచ్చు. అస్పష్టత నుంచి స్పష్టత వైపు కావచ్చు. ఐహిక విషయాల నుంచి అలౌకిక జిజ్ఞాస వైపుగా కావచ్చు.