ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:45 IST)

సత్యవతి కుమారుడే వ్యాస మహర్షి.. అతను ఎలా జన్మించాడంటే?(వీడియో)

బెస్త స్త్రీ సత్యవతికి, పరాశర మునీంద్రుడికి జన్మించవాడు వ్యాస మహర్షి. సత్యవతి అసలు పేరు కాళి. ఆమెనే మత్స్యగంధి అని కూడా పిలుస్తారు. ఒక సారి చేది దేశపు రాజు వేటకని అడవికి వెళ్లాడు. కాళిందీ నది ఒడ్డున కామకేళిలో ఉన్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహం చేసుకోలేకపోయాడు. అతని రేతస్సును అదే నదిలో శాపవశాన చేప రూపంలో ఉన్న అద్రిక అనే దేవకన్య స్వీకరించింది. 
 
చేప గర్భందాల్చింది. కడుపుతో ఉన్న చేప ఎటూ కదల్లేక చేపలు పడుతున్న బెస్తవాని వలకు చిక్కింది. బెస్తవాడు ఆ చేపను ఇంటికి తీసుకువెళ్లి కోయగా ఇద్దరు శిశువులు బయటపడ్డారు. మగశిశువును బెస్త రాజుగారికి అప్పజెప్పాడు. ఆడ శిశువుకు మాత్రం కాళి అని పేరు పెట్టి తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కాళి పెరిగి పెద్దదైంది, పెళ్లి వయస్సు వచ్చింది. 
 
ఇదిలా ఉండగా ఒకనాడు పరాశర మహర్షి కాళిందీ నది దగ్గర నిల్చుని అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి పడవ కోసం చూస్తున్నాడు. అప్పుడే కాళి తండ్రి తినడానికి కూర్చుని చద్ది మూట విప్పుతున్నాడు. పరాశరుని పడవలో చేరవేసే పనిని కూతురికి పురమాయించాడు. కాళి పడవ నడపడానికి సిద్ధమైంది. పరాశర మహర్షి పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. 
 
కొంత దూరం వెళ్లాక ఎగిసిపడే అలలు, ఎగిరెగిరిపడే చేప పిల్లలు, పడవ నడిపే వయ్యారి పరాశరునికి చిత్తచాపల్యం కలిగించాయి. కామోద్రేకంతో ఆమెను చేరుకున్నాడు. మునీశ్వరుని కోరికను పసిగట్టి కాళి దూరంగా జరిగింది. పరాశరుడు ఆగలేదు. పడవ చుట్టూ పొగ మంచు కమ్ముకునేలా చేశాడు. కాళి శరీరం నుండి పరిమళాలు వెదజల్లేట్లు చేసాడు. నది మధ్యలో ఓ దీవిని సృష్టించాడు. 
 
అక్కడ వారిద్దరూ సంగమించారు. మత్స్యగంధి గర్భందాల్చింది. పరాశరుడు ఆమెను ఓదార్చి నీవు గర్భం ధరించినా కన్యత్వానికి ఏమీ మచ్చ ఉండదు అని వరం ఇచ్చాడు. నీకు పుట్టబోయే బిడ్డ విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు అయి ముల్లోకాల్లో కీర్తింపబడతాడు. జగద్గురువవుతాడు. ఏక రాశిగా ఉన్న వేదాలను విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. 
 
మహా తపస్వీ, మహిమాన్వితుడూ అవుతాడు అని దీవించాడు. ఇప్పుడు నీ నుండి వెలువడుతున్న సుగంధ పరిమళాలు శాశ్వతంగా ఉండిపోతాయని, నీవు యోజనగంధిగా పిలవబడతావని మాటిచ్చాడు. అలా వారికి పుట్టినవాడే వ్యాస మహర్షి. చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల పట్ల వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దవాడయ్యాక, తల్లీ నా గురంచి విచారించకు. 
 
తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం వచ్చినా, లేదా చూడాలనిపించినా నన్ను తలచుకో. నేను నీ ముందు ఉంటాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. వ్యాసుని తల్లే చంద్రవంశానికి చెందిన శంతన మహారాజును పెళ్ళి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. 
 
ఇరువర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురుపాండవులు ఆయన సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కంటే అడవులలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ.