సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 17 మే 2018 (21:24 IST)

ఈ కలియుగంలో చేయాల్సినది ఏమిటి?

ఆధ్యాత్మిక ధర్మము క్రొత్తగా ఏమీ ఇవ్వదు. అది కేవలం అంతరాయాలను తొలగించి, స్వస్వరూపాన్ని వీక్షింపజేస్తుంది. మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు, కష్టభూయిష్టాలైన యోగాలు నేడు ఉపయోగపడవు. ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం, ఇతరులకు సహాయపడటం. దానం అంటే పారమార్ధిక జ్ఞానాన

ఆధ్యాత్మిక ధర్మము క్రొత్తగా ఏమీ ఇవ్వదు. అది కేవలం అంతరాయాలను తొలగించి, స్వస్వరూపాన్ని వీక్షింపజేస్తుంది. మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు, కష్టభూయిష్టాలైన యోగాలు నేడు ఉపయోగపడవు. ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం, ఇతరులకు సహాయపడటం. దానం అంటే పారమార్ధిక జ్ఞానాన్ని అందించడం అత్యుత్తమ దానం, దాని తర్వాత వ్యావహారిక జ్ఞాన దానం. ఆ పిమ్మట ప్రాణ రక్షణ, చివరిది అన్నపానీయాలను అందించడం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు జీవుణ్ణి జననమరణ చక్ర పరంపర నుండి రక్షించగలరు.
 
కోరనూవద్దు, త్రోసి పుచ్చనూ వద్దు. లభించిన దానిని స్వీకరించు. దేనివల్లా బాధించబడకుండా ఉండడమే స్వాతంత్ర్యం. సహించి ఉన్నంత మాత్రాన చాలదు, అసంగుడవు కావాలి. భగవంతునిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని పూర్వపు మతాలు బోధించాయి. తనపై తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతం బోధిస్తున్నది.
 
కండబలం నిజానికి గొప్పదే, కండబల వ్యక్తీకరణలు గొప్పవే. యంత్రాలు, విజ్ఞాన శాస్త్ర పరికరాల ద్వారా అభివ్యక్తీకరింపబడిన బుద్ధిశక్తి కూడా గొప్పదే. కాని ప్రపంచంపై ఆత్మశక్తి చూపే ప్రభావం కన్నా ఇవేవి శక్తిమంతమైనవి కావు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చే కానుక ఆధ్యాత్మిక జ్ఞానమే. మన ఆధ్యాత్మిక భావాలు కంటికి కనపడక, చెవికి వినపడక, తెల్లవారు జామున మెల్లమెల్లగా నేలకు జాలువారు మంచు బిందువుల వలె ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి.
 
ఘనకార్యాలను సాధించడానికే భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడని విశ్వసించి, ఉత్సాహంగా ఉండండి. మనం వాటిని సాధించే తీరుతాం.