Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు
కడప జిల్లా కందిమల్లాయపల్లెలో ఆధ్యాత్మిక గురువు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పూర్వీకుల ఇంటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని పునరుద్ధరించడంలో ఆయన తీసుకున్న వేగవంతమైన చర్యల పట్ల భక్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షించే పవిత్ర తీర్థయాత్ర కేంద్రంగా పరిగణించబడే బ్రహ్మంగారి పురాతన ఇల్లు, తీవ్రమైన మొంథా తుఫాను ప్రభావంతో కూలిపోయింది. బ్రహ్మంగారి మఠం కూలిపోయిన వార్త విన్న వెంటనే భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
చాలామంది భక్తులు బ్రహ్మంగారి మఠం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు దాని నిర్వహణను నిర్లక్ష్యం చేశారని అధికారులను విమర్శించారు. మఠంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని కూడా భక్తులు మండిపడ్డారు.
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దం కాలజ్ఞానం తెలియజేశారు. ఈ కాలజ్ఞానంలో ఆయన భవిష్యత్తు గురించి అనేక అంశాలను ముందుగానే అంచనాలు వేశారు. ఆయన కాలజ్ఞానంలోని విషయాలన్నీ నిజమయ్యాయని ఆయన భక్తులు విశ్వసిస్తున్నారు. బ్రహ్మం గారుగా ప్రసిద్ధి చెందిన ఆయన విష్ణువు అవతారమని నమ్ముతారు.