మంగళవారం, 15 ఏప్రియల్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (20:01 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఎలా జరిగిందంటే?

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియ్యంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలను బంగారు వాకిలి చెంత నిర్వహించారు.
 
శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్తానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనను అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.
 
నూతన పట్టు వస్త్ర సమర్పణను మూల విరాట్టు, దేవతా మూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయ్యింది. అనంతరం తీర్థ శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.