మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (20:13 IST)

గరుడ సేవ రోజు గరుడ పక్షి కనబడింది.. అరుదైన పక్షి అపస్మారక స్థితిలో..? (video)

గరుడ సేవలో ధ్రువమూర్తి వేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి మలయప్పస్వామికి భేదం లేదు. అందుకే మలయప్పస్వామిని గరుడ వాహనంపై ఉండగా వీక్షించడం మోక్షదాయకం. గరుడ సేవ సందర్భంగా మూలవిరాట్టుకు నిత్యం అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల వంటి విశిష్ట అభరణాలను మలయప్పస్వామికి అలంకరిస్తారు. 
 
గరుడోత్సవాన్ని వీక్షిస్తే వైకుంఠ ప్రాప్తిస్తుంది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని ప్రశస్తి. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఈ సేవ రోజున తిరుమలలో గరుడపక్షుల సంచారం మరో అద్భుతం. గరుడసేవ జరిగే సమయానికి ఆకాశంలో విహరించే గద్దలు మిగతా ఏ సేవ రోజూ కూడా కనిపించకపోవడం విశేషం. అందుకే గరుడోత్సవానికి అంతటి ప్రాశస్త్యం ఉంది.
 
అలాంటి గరుడోత్సవం బుధవారం రాత్రి తిరుమలలో జరుగనుంది. శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ నేపథ్యంలో తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది. జిల్లా కోర్టు ఆవరణలో గరుడ పక్షి కనిపించింది. ఎగరలేని స్థితిలో ఉన్న అరుదైన పక్షిని చూసి లాయర్లు అందరూ వింతగా చూశారు.
 
అరుదైన పక్షి అపస్మారక స్థితిలో కనపడటం వెంటనే తిరుపతి అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అటవీ శాఖకు చెందిన శంకర్ వచ్చి గరుడ పక్షిని ఎస్వీ జూకు తరలించారు. వైద్యం అందించి కోలుకున్న తరువాత శేషాచలంలో వదులుతామని ఫారెస్టు అధికారి శంకర్ తెలిపారు. పురాణాలలో చెప్పినట్లు తిరుమలలో గరుడ సేవ రోజు గరుడ పక్షి కనపడటం శ్రీవారి మహిమేనని భక్తులు అంటున్నారు.