మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (09:20 IST)

ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవంలో అపశృతి: వడగండ్ల వానతో నలుగురు భక్తుల మృతి

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం జరుగుతున్న వేళ వడగండ్ల వాన రావడంతో భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించకుండానే వెనుదిరిగారు.

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం జరుగుతున్న వేళ వడగండ్ల వాన రావడంతో భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించకుండానే వెనుదిరిగారు. శుక్రవారం (మార్చి-30)  ఒంటిమిట్టలో ఒక్కసారిగా గాలి వాన.. ఉరుములు మెరుపులు రావడంతో భక్తులు భయంతో జడుసుకున్నారు. 
 
ఏకంగా ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. కోదండరాముడి షెడ్డువద్ద మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఒంటిమిట్టలో వడగళ్ల వాన కురవడంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. భారీ వర్షంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
 
అకాల వర్షంతో కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు నానా తంటాలు పడ్డారు. భారీ వర్షంతో పాటు భారీగా వీస్తోన్న ఈదురు గాలులకు కల్యాణవేదిక తారుమారైంది. రేకులు, పైకప్పులు కూలడంతో కొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
 
ఇదిలా ఉంటే.. ఒంటిమిట్టలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించడంతో రాములోరి కల్యాణం కోసం వెళ్లిన భక్తుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 52మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను కడప రిమ్స్‌కు తరలించగా.. వారిని సీఎం చంద్రబాబునాయుడు శనివారం పరామర్శించారు. 
 
కాగా.. గాలివానలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 3లక్షలు ఎక్స్‌గ్రేషియాను చంద్రబాబు సర్కారు ప్రకటించింది. ఇకపోతే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నాడు రథోత్సవం జరగనుంది.