బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (12:56 IST)

నేటి నుంచి శ్రావణ మాసం : పెళ్లిళ్లకు శుభముహూర్తాలు ఇవే

మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించే నోముల మాసమైన శ్రావణమాసం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసం మహిళలకు ఎంతో విశిష్టమైనది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. 
 
శ్రావణ మాసంలో ప్రతి రోజు మంచి రోజుగానే చెప్పుకున్నా కొన్ని రోజులు మాత్రం శుభకార్యాలకు అనుకూలంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శ్రావణమాసం సెప్టెంబరు 6వ తేదీతో ముగుస్తుంది. 
 
ఈ పవిత్ర మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి. మరి ఈ మాసంలో మంచి రోజులు ఏవో తెలుసుకుందాం. ఈ నెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 
 
14న లక్ష్మీవేంకటేశ్వర వ్రతం, 15న నారసింహ వ్రతం, 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం, 24న వెంకయ్య స్వామి ఆరాధన, 23 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు, 30న కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్‌ 6న పొలాల అమావాస్యతో శ్రావణం ముగిసి భాద్రపదం ప్రవేశిస్తుంది.
 
ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే కట్టుబాట్లు, నియమాలు ప్రతివారికీ తగిన వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయి. ముఖ్యంగా పసుపు కుంకుమల వినియోగం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. 
 
ఈ నెల 11, 13, 15, 18, 20, 22, 25, 27, 31, వచ్చే నెల 1, 4, 5 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి. అంతేకాదు 11, 12, 13, 14, 18, 19, 20, 25, 26, 27, సెప్టెంబర్‌ 1 తేదీలు పెళ్లిళ్లకు, ఇతర శుభాకార్యాలు మంచి రోజులు ఉన్నాయి.
 
ఇక గృహ నిర్మాణ పనులకు ఈనెల 11, 15, 18, 20, 23, 25, 27, సెప్టెంబర్‌ 1 తేదీలలో మంచి రోజులున్నాయి. ఈనెలలో 15, 20, 27 తేదీలు గృహ ప్రవేశాలకు అనువైన రోజులున్నాయి.