గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 అక్టోబరు 2021 (21:13 IST)

తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సర్వసిద్ధం, వివరాలు

తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్థమైంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టిటిడి ఇప్పటికే పూర్తి చేసింది. తొమ్మిదిరోజు పాటు బ్రహ్మోత్సవాలు జరుగనుండగా ఏకాంతంగానే ఉత్సవాలను నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాహనమండపంలో ఏకాంతంగానే జరుగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 29వ తేదీ ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు.
 
తొమ్మిదిరోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు 30వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. 1వ తేదీ పెద్దశేషవాహనం, సాయంత్రం హంసవాహనం, 2వతేదీ ముత్యపు పందిరివాహనం, రాత్రి సింహవాహనం, 3వతేదీ ఉదయం కల్పవృక్షవాహనం, సాయంత్రం హనుమంతవాహనం, 4వతేదీ పల్లకీ ఉత్సవం, సాయంత్రం వసంతోత్సవ, గజవాహనం, 5వతేదీ సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్థరథం బదులు సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనసేవలు జరుగనున్నాయి.
 
6వ తేదీ సూర్యప్రభవాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 7వ తేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం సర్వభూపాల వాహనం, అశ్వవాహనం, 8వతేదీ పంచమీతీర్థం జరుగనుంది. ఏకాంతంగానే అన్ని వాహనసేవలు తిరుచానూరులోని మండపంలో జరుగనున్నాయి.