1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (19:47 IST)

తిరుమల కంటైన్మెంట్ జోనా? జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుమల పట్టణం కరోనా కంటోన్మెంట్ జోనుగా మారిందా? ఎందుకంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పని చేస్తున్న సిబ్బందిలో 80 మందికి కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తిరుమలను కంటైన్మెంట్ జోన్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో భక్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
తితిదే అధికారులు కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత తాము చేసిన తప్పను తెలుసుకుని సరిదిద్దారు. అయితే పొరపాటున తిరుమలను కంటైన్మెంట్ జోనుగా ప్రకటించామంటూ జిల్లా కలెక్టర్ మరో లిస్టును విడుదల చేశారు. తాజా ప్రకటనతో శ్రీవారి భక్తులకు ఆటంకం తొలగిపోయింది.
 
తిరుమలను కంటైన్మెంట్ జోనుగా గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే మరో ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా తిరుమలకు రావొచ్చని తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు 10 వేల మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు డబుల్ సెంచరీ కొట్టాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదు కావడం ఇపుడు కలకలం రేపుతోంది.