శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (11:54 IST)

శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్.. ఇక హాయిగా చూసిరావొచ్చు...

తిరుపతి తిరుమల వెంకన్న దర్శనాన్ని తితిదే మరింత సులభతరం చేయనుంది. శ్రీవారి దర్శనం కోసం టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచివుండే అవసరం లేకుండా సులభతరంగా దర్శనం చేసుక

తిరుపతి తిరుమల వెంకన్న దర్శనాన్ని తితిదే మరింత సులభతరం చేయనుంది. శ్రీవారి దర్శనం కోసం టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచివుండే అవసరం లేకుండా సులభతరంగా దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఈ టైమ్‌స్లాట్ అమల్లోకి వస్తే కేవలం రెండు నుంచి మూడు గంటలలోగానే దర్శనం పూర్తికానుంది. ఈ కొత్త విధానాన్ని డిసెంబరు రెండోవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
 
దేశం నలుమూలల నుంచీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు జనరల్‌ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొంటున్నారు. పేద, దిగువమధ్యతరగతి భక్తులు సర్వదర్శనం క్యూలైన్లలో రద్దీ పెద్దగా లేని రోజుల్లో కూడా ఐదారు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో టైమ్ స్లాట్ విధానాన్ని తితిదే ప్రవేశపెట్టనుంది. 
 
ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో 8-10 గంటల సమయం పడుతుంది. వరుస సెలవుల రోజులు, ప్రత్యేక పర్వదినాల్లో 14 నుంచి 15 గంటల పాటు క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. 
 
శ్రీవారిని దర్శించుకునేవారిలో 60 నుంచి 70 శాతం మంది సర్వదర్శనం భక్తులే. వీరికి తక్కువ సమయంలోనే స్వామి దర్శనమయ్యే విధానంపై టీటీడీ దృష్టి పెట్టింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ముఖ్య అధికారులతో కలిసి టైమ్‌స్లాట్‌ విధానానికి రూపకల్పన చేశారు.
 
సర్వదర్శనం భక్తుల కోసం రెండు విధానాలను అమలు చేస్తారు. ఒకటి టైమ్‌స్లాట్‌ విధానం. రెండోది సాధారణ క్యూలైన్‌ పద్ధతి. తిరుమలలో 21 ప్రాంతాల్లో 150 టైమ్‌స్లాట్‌ కౌంటర్లు ఉంటాయి. వీటివద్దకు వెళ్లిన భక్తులకు ఎన్ని గంటలకు క్యూలైన్‌లోకి వెళ్లాలో పేర్కొంటూ టికెట్లు ఇస్తారు. ఆ సమయానికి క్యూలైన్‌లో ప్రవేశిస్తే చాలు, 2 గంటల్లోపే దర్శనం పూర్తయి బయటకు రావచ్చు. 
 
మరో విధానంలో టైమ్‌స్లాట్‌ టికెట్లు లేకుండా నేరుగా కూడా సర్వదర్శనం క్యూలైన్‌లో ప్రవేశించవచ్చు. ఇలాంటి భక్తులు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలోనే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టే టైమ్‌స్లాట్ విధానం విజయవంతమైతే దశలవారీగా ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న ఆలోచనలే తితిదే ఉంది.