బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2019 (19:27 IST)

కమనీయం.. తిరుమల శ్రీవారి పుష్పయాగం

శ్రీవారి పుష్పయాగం తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. పుష్పాలంకార ప్రియుడు, నిత్యకల్యాణ స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి   బ్రహ్మోత్సవాలు పూర్తయిన నెల రోజుల తరువాత వచ్చే కార్తీక మాసంలో శ్రవణా నక్షత్ర రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేశారు. అనంతరం స్నపనతిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
 
ఈ మహోత్సవంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత మంగళవారం మధ్యాహ్నం  ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి సమక్షంలో ఉద్యాన వనం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఈ పుష్పాలను టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.
 
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మొదలైన పుష్పయాగం మహోత్సవంలో ఈ పుష్పాలను శ్రీదేవి-భూదేవి సమేత మలయప్ప స్వామి వారిపై అర్చన చేశారు. ఇందుకోసం టిటిడి ఉద్యానవన విభాగం మొత్తం 8 టన్నుల పుష్పాలు, 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను శ్రీవారికి వివిధ రకాల దాతలు సమర్పించడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ నుండి ఒక టన్ను పుష్పాలు, కర్ణాటక నుండి 2 టన్నులు, తమిళనాడు నుండి 5 టన్నుల పుష్పాలను సేకరించడం జరిగిందని టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.