ఓం నమో నారాయణా... శ్రీ వేంకటేశుని ఇలా పూజిస్తే...
వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏదీ అంటే పురాణాల ప్రకారం శనివారం అని చెప్పబడింది. అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అందుకుగాను శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.
అనంతరం తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు "ఓం నమో నారాయణా" అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి.
బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపమెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి.