హనుమంతుని స్మరించడం వలన....
హనుమంతుని స్మరించడం వలన విచక్షణా జ్ఞానం, బలం, కీర్తి, ధైర్యం లభిస్తాయి. భయం తొలగిపోతుంది. శారీరక, మానసిక రోగాలు తొలగిపోతాయి. హనుమంతుడు శ్రీరామ చరణ దాసునిగా, రామ భక్తునిగా లోకానికి సుపరిచితమైనా, ఆయనలో అనిర్వచనీయమైన ఎన్నోశక్తులు, మహిమలు దాగి ఉన్నాయి.
హనుమకు మంత్రశాస్త్రంలో విశేషమైన స్థానం ఉంది. ఇన్ని శక్తులు ఉన్న హనుమంతునికి తనకున్న శక్తి సామర్ద్యాలు తెలియవు. ఎవరైనా గుర్తు చేసి పొగిడితేనే తెలుస్తాయి. ఎందుకంటే.... ఆంజనేయుడు బాల్యంలో మునివాటికలో ఉన్నప్పుడు ఎంతో అల్లరి చేసేవాడు. ఆ అల్లరి భరించలేక కొందరు మునీశ్వరులు నీకున్న శక్తిసామర్ద్యాలు నీవు మరచిపోతావనీ, ఎవరైనా నీకు గుర్తు చేస్తే తప్ప నీకు తెలియదనీ శాపం ఇచ్చారు. అందువలన హనుమకున్న తేజోబలాలు అతనికి గుర్తుకు రావు.
సీతాదేవి కోసం సముద్రాన్ని దాటవలసినప్పుడు తగిన సామర్ద్యం కలిగిన వానర వీరుని కోసం అన్వేషించాడు జాంబవంతుడు. అప్పుడు హనుమ శక్తి సామర్ద్యాలను గుర్తు చేసి పొగిడి ప్రోత్సహించాడు. దానితో హనుమ తేజోవంతుడై గగన మార్గాన లంకకు పయనమై నూరు యోజనాల సముద్రాన్ని దాటగలిగాడు. ఆంజనేయుడు ఒక పక్షిలా గగన మార్గంలో పయనించి ఎన్నో సాధక బాధలను అతిక్రమించి లంకకు చేరుకుని సీతామాతను సందర్శించాడు.
రావణుని సభలో హెచ్చరించి, లంకా దహనం చేసి, నిర్భయంగా తిరిగి వచ్చిన కార్యదక్షుడు హనుమ. శ్రీరామచంద్రునికి సీతాదేవి ఉనికి తెలియచేసాడు. సముద్రంపై వారధి నిర్మించి రావణ సంగ్రామంలో కీలక పాత్ర వహించాడు. రావణ వధ అనంతరం సీతాదేవిని శ్రీరామునికి అర్పించాడు. అయోధ్య చేరి శ్రీరామ పట్టాభిషేకం చేశాడు. ఇలా రామాయణంలో.... హనుమపాత్ర అడుగడుగునా మనకు ద్యోతకమవుతుంది.