ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:17 IST)

తిరుమ‌ల ‌: శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా సోమ‌వారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి, తెలియక జ‌రిగిన‌ దోషాల నివార‌ణ‌కు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు. తిరుమలలో 15వ‌ శతాబ్దం వరకు పవిత్రోత్సవాలు జరిగినట్టు ఆధారాలున్నాయ‌ని, 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందని వివ‌రించారు. 
 
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం స్నాపనతిరుమంజనం నిర్వ‌హిస్తున్నామ‌ని, సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నార‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్న‌ట్టు తెలిపారు. భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఎక్కువ స‌మ‌యం సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం కల్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.
 
కాగా, ప‌విత్రోత్స‌వాల్లో రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ  శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలల‌ సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.
 
చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా విశేష‌పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవ రద్దయ్యాయి. ఈ కార్యక్రమంలో సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్వోలు మ‌నోహ‌ర్‌,  ప్ర‌భాక‌ర్‌, పేష్కార్‌  లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.