మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:31 IST)

ప్రేమంటేనే భయపడుతుంటారు పెద్దలు.. ఎందుకు..?

ప్రేమ అనగానే యువతలో ఆనందం పొంగుతుంది. కానీ పెద్దవారిలో ఆందోళన పెరుగుతుంది. ప్రేమ లేని జీవితం వ్యర్ధం అంటుంది ఉరకలేసే యవ్వనం. జీవితంలో వ్యర్థమైంది ప్రేమే అంటుంది యవ్వనం దాటేసిన పెద్దరికం. ప్రేమ విషయంలో యువత అంతలా ఆనందిస్తుంటే మరి పెద్దవాళ్లు మాత్రం ఎందుకలా భయపడుతారు... అని ఆలోచిస్తే సమాధానం దొరక్కపోదు. 
 
ప్రేమ అన్నది మనసులోకి అడుగుపెట్టేది వయసు పొంగు ఆరని యవ్వనంలోనే. మనిషిలో యవ్వనం ఉరకలేస్తున్న వేళ అతనికి లోకమే వింతగా కన్పిస్తుంది. తన వయసువారు చేసేదే గొప్పగా తమకంటే పెద్దవారు చేసేది, చెప్పేది చాదస్తంగా అన్పిస్తుంది. అందుకే యువత తమలా ఎందుకు ఆలోచించరని పెద్దవాళ్లు బాధపడుతుంటే, పెద్దవారు తమలా ఎందుకు ఉండలేక పోతున్నారని యువత జాలి పడుతుంటుంది.
 
తెలిసీ తెలియని వయసులో మనసులో కలిగిన ఆకర్షణనే ప్రేమ అనుకుని దానికోసం జీవితాన్ని పాడుచేసుకున్న ఎంతోమంది యువత మన కళ్లకు కన్పిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని చూచిన పెద్దవారు ప్రేమ గురించి భయపడడంలో తప్పేముంది.      
 
ఇలా జీవితం గురించి రెండు వేర్వేరు కోణాల్లో ఆలోచించే పెద్దవారు, యువత ప్రేమ విషయంలో సైతం అలాగే ఆలోచిస్తుంది. అందుకే యవ్వనంలోని లేత మనసుకు ప్రేమ అమృతంలా అనిపిస్తే గాయాలతో రాటుదేలిన పెద్దవారి మనసుకు ప్రేమ ఓ విషంలా అన్పిస్తుంది. అలా ప్రేమను విషంగా భావించే పెద్దవారు తమ పిల్లలు ప్రేమ పేరు చెబితే ఎందుకు భయపడకుండా ఉంటారు. 
 
అయితే ఇక్కడ మనం ఓ విషయం ఆలోచించక తప్పదు. ప్రేమ గురించి పెద్దవారు ఎందుకు అంతలా భయపడుతారు అంటే... అందుకు కూడా కొన్ని కారణాలుంటాయి. జీవితంలో బాగా కష్టపడి ఉన్నతస్థాయికి చేరాల్సిన యవ్వన ప్రాయంలో ప్రేమ పేరుతో తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారో అన్నదే పెద్దవారి ప్రధాన భయం.