శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (14:41 IST)

''భోగి'' రోజున రేగిపళ్ళు పిల్లల నెత్తిపై ఎందుకు పోస్తారు?

సంక్రాంతి నాలుగు రోజుల పండుగ. ఈ పండుగ మొదటి రోజును ''భోగి'', అని రెండో రోజును ''మకరసంక్రాంతి'' అని, మూడో రోజున ''కనుమ'', నాలుగో రోజును ''ముక్కనుమ'' అంటూ జరుపుకుంటారు. వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్

సంక్రాంతి నాలుగు రోజుల పండుగ. ఈ పండుగ మొదటి రోజును ''భోగి'', అని రెండో రోజును ''మకరసంక్రాంతి'' అని, మూడో రోజున ''కనుమ'', నాలుగో రోజును ''ముక్కనుమ'' అంటూ జరుపుకుంటారు. వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనిపిస్తారు. 
 
పల్లెల్లో సంక్రాంతి పండుగను ఈ ఏడాది అట్టహాసంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమైపోయారు. అంతేగాకుండా షాపుల్లో కొనే పిండిపదార్థాలు, తీపి పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకునేందుకు పల్లె పడుచులు ఆసక్తి చూపుతున్నారు. కొత్త దుస్తులు, పిండిపదార్థాలు అన్నీ పండగకు రెండు రోజుల ముందే సిద్ధమైపోయాయి. కోనసీమ, గోదావరి జిల్లాల్లోని గ్రామాల్లో ఏ ఇంటికెళ్లినా ఘుమఘుమలు రేపే తీపిపదార్థాలు తయారు చేస్తున్నారు. 
 
గ్రామ పడుచులు, యువతులు పిండి వంటలు చేస్తున్నారు. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోనూ కోడిపందేలు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యుడు ప్రతీ నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి పండుగ. ఇక భోగి సంక్రాంతికి ముందు రోజు వస్తుంది. 'భోగి' పండుగతో సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా ప్రారంభమవుతాయి. 
 
తెల్లవారుజామునే ఇంటిముంగిట రంగురంగుల రంగవల్లికలను వేసి, ఆ ముగ్గుల మధ్య పేడముద్దలతో గొబ్బెమ్మలు పెడతారు. కన్నెపిల్లలంతా గొబ్బి పాటలు పాడతారు. పాత కలప వస్తువులు భోగి మంటల్లో వేసి.. పీడ విరగడైనట్లుగా భావించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో వుంది. భోగి మంటల్లో భోగి మంటల్లో కాచిన వేడి నీళ్ళతో తలంటు స్నానం చేసి, భగవద్ధర్శనం చేసే సంప్రదాయం అన్నిచోట్లా వుంది. 
 
అలాగే భోగి పండుగ రోజున పులిబొమ్మ పక్కనే మేకబొమ్మ, పూరిల్లు-మేడ, రాజు-బంటు... ఇలా విరుద్ధ జీవుల మధ్య సామరస్యాన్ని, సామ్యవాదాన్ని చాటుతూ, కనువిందు చేసేదే బొమ్మల కొలువును తెలుగువారి లోగిళ్ళలో అలంకరిస్తారు. ఆపై ముత్తైదువులను పిలిచి, పేరంటం చేస్తారు. సాయంత్రం తమ ఇంట్లోని చిన్నారులను, పెద్దలంతా దీవించి వారి తలపై 'భోగి'పళ్ళు (రేగుపళ్ళు) పోస్తారు.

 
భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు. భోగిపళ్ళలో చేమంతి, బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు పాలకాయలు కలిపి పిల్లల తలపై పోస్తారు.