మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (09:07 IST)

సింధు ప్రతీకార విజయం : తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లోకి

గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో తడబడిన పీవీ సింధు తన తప్పిదాలను సరిచేసుకొని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూసుకెళుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌‌కు చేరుకుంది.

గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో తడబడిన పీవీ సింధు తన తప్పిదాలను సరిచేసుకొని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో దూసుకెళుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధు 21–14, 21–14తో ప్రపంచ పదో ర్యాంకర్‌ చెన్‌ యుఫెను చిత్తుగా ఓడించింది. 
 
ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలోకి వచ్చింది. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏదశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే, అడపాదడపా స్మాష్‌లతో అలరించిన సింధు దూకుడుకు చెన్‌ యుఫె వద్ద సమాధానం కరువైంది. ఒత్తిడికిలోనైన ఈ చైనా స్టార్‌ క్రమం తప్పకుండా అనవసర తప్పిదాలు చేసి ఏదశలోనూ పుంజుకున్నట్లు కనిపించలేదు. 19 నిమిషాల్లో తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు రెండో గేమ్‌లోనూ నిలకడగా ఆడింది.
 
ఆరంభంలో 0–3తో వెనుకబడిన సింధు ఆ తర్వాత తేరుకుంది. గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో చెన్‌ యుఫె చేతిలో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకున్న ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 5–5తో సమం చేసింది. అనంతరం 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఈ ఆధిక్యాన్ని చివరివరకు కాపాడుకొని 22 నిమిషాల్లో రెండో గేమ్‌ను దక్కించుకొని విజయాన్ని అందుకుంది.